సనాతన హిందూ ధర్మంలో గ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. 2024లో రెండు చంద్ర గ్రహణాలు, రెండు సూర్య గ్రహణాలు ఏర్పడతాయి. తొలి చంద్ర గ్రహణం వచ్చే నెల 25న ఫాల్గుణ పూర్ణిమ రోజు ఏర్పడనుండగా, దీనితర్వాత 15 రోజుకు తొలి సూర్య గ్రహణం సంభవిస్తుంది. చంద్ర గ్రహణానికి 9 గంటలు ముందుగా ఏర్పడనున్న సూతక్ కాలం వల్ల సంభవించే అశుభాలు తొలగిపోవడానికి కొన్ని పరిహారాలున్నాయి.
ఆహారం, నీళ్లు తీసుకోవడానికి ముందు తులసి ఆకులను తీసుకుంటే గ్రహణంవల్ల సంభవించే అశుభాలు వీటిని తాకవు. అలాగే గ్రహణ సమయంలో దూర్వాగడ్డిని ఉపయోగించడంవల్ల ఎటువంటి వ్యతిరేక ప్రభావాలు సంభవించవు. గ్రహణ సమయంలో ప్రతికూల శక్తులన్నీ మేల్కొంటాయి. వాటి దుష్ఫలితాలను నివారించడానికి దానధర్మాలు చేయాలి. ఆ సమయంలో చేసే దానాలను ఎంతో శుభప్రదంగా పరిగణిస్తారు. రాహువు, కేతువు బాధల నుంచి బయటపడాలంటే నువ్వులను దానమివ్వాలి. ఎంతో పవిత్రమైన గంగాజలంతో గ్రహణ సమయంలో స్నానం చేస్తే అన్ని దుష్ప్రభావాల నుంచి బయటపడతారు. చాలామంది ఇళ్లల్లో పవిత్రమైన నదీజలాలు ఉంటాయి. గ్రహణ సమయంలో వీటిని తాకకుండా ఉంటే మంచిది. గ్రహణం ముగిసిన తర్వాత పవిత్రమైన జలంతో స్నానం చేస్తే అన్ని ప్రతికూల శక్తులు నశిస్తాయి.