చీరాల నియోజకవర్గంలో వైసీపీలో వర్గవిభేదాలు తారా స్థాయికి చేరాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నుంచే పోటీచేయాలని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తన వర్గీయులతో స్పష్టం చేసినట్లు సమాచారం. ఏదైనా పార్టీ తరుపునా లేదా స్వతంత్రంగానా అనేది త్వరలోనే ప్రకటిస్తానని చెప్పినట్లు ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం ఆమంచి పర్చూరు నియోజకవర్గానికి వైసీపీ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల తాడేపల్లిలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసి వెళ్లారు. రానున్న ఎన్నికల్లో చీరాల నుంచే పోటీ చేయాలన్న ఆలోచనను ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం చీరాల నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా ఉన్న కరణం వెంకటేష్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటి నుంచే జోరుగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమంచి చేసిన వ్యాఖ్యలు వైసీపీకి తలనొప్పిగా మారాయి. తాను పోటీ చేయబోతున్నామన్న విషయాన్ని ముందుగానే ప్రజల్లోకి తీసుకెళ్లండి అని తన వర్గీయులకు చెప్పడం తీవ్ర చర్చనీయాశమైంది. మరి ఆమంచి వ్యాఖ్యలను వైసీపీ అధిష్టానం ఎలా తీసుకుంటుందో చూడాలి.