తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించడమే ప్రజాపాలన ఉద్దేశ్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నొక్కి చెప్పారు. అబ్దుల్లాపూర్ మెట్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన భట్టి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తమ ప్రభుత్వం ప్రజల చేత ప్రజల కోసం అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వమని, ఓ వర్గానికి, ఒక వ్యక్తికి సంబంధించిన ప్రభుత్వం తమది కాదని, రాష్ట్రాన్ని, సంపదను ప్రజలకు అంకితం చేసే ప్రజా ప్రభుత్వమని స్పష్టం చేశారు. గడిచిన దశాబ్ద కాలంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు కాలేదని గుర్తు చేశారు. రెండు పడక గదుల ఇళ్ల కోసం పేద కుటుంబాలు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశాయన్నారు. గడిచిన పదేళ్లలో రాష్ట్ర ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలు పొందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడానికె తమ ప్రభుత్వం ప్రజల చెంతకే వెళ్లి ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి చేపట్టిన కార్యక్రమమే ప్రజాపాలన అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.