ఏపీలో మహిళలకు త్వరలోనే తీపి కబురు చెప్పనుంది చంద్రబాబు ప్రభుత్వం. ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ పథకాన్ని విశాఖపట్నం నుంచే ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేస్తున్న తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించిన అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు. గతంలో జగన్ ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేయలేదని విమర్శించారు. ఉద్యోగులకు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీని ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.