విజయవాడలో నిర్వహించిన చేనేత దినోత్సవం వేడుకలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్టాల్స్ ఏర్పాటు చేసుకున్న చేనేత కార్మికులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. స్టాల్స్‌ను సందర్శించి చేనేత వస్త్రాలను పరిశీలించారు. తన సతీమణి కోసం పట్టు శారీలు కొనుగోలు చేశారు. వాటి ప్రాధాన్యతను, ధరలపై ఆరా తీశారు. తన నచ్చిన శారీలను ఇస్తే భువనేశ్వేరి సంతోషిస్తుందని పేర్కొన్నారు. చేనేత చీరలు కొని నేతన్నలను ఎంకరేజ్ చేశారు.చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విజయవాడ మేరీస్ స్టెల్లా కళాశాలలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం చంద్రబాబు గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 97 వేల మంది నేతన్నలకి, 50 ఏళ్ళకే రూ.4 వేల పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. స్కిల్ డిజైన్ నేర్పించి, ఆదాయం పెంచే విధానం తీసుకుని వస్తామని తెలిపారు. చేనేత కార్మికుల ఆరోగ్యం కోసం ఆరోగ్య భీమా కోసం, రూ.10 కోట్లు వెంటనే ఇస్తున్నామని ప్రకటించారు. పొదుపు నిధిలో త్రిఫ్ట్ ఫండ్ లో, రాష్ట్ర ప్రభుత్వ వాటా 8% నుంచి 16% పెంచి, నేతన్నల భవిష్యత్తు అవసరాలకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రూ.70 కోట్ల వరకు జీఎస్టీ రీయింబర్స్ చేస్తామని తెలిపారు. గ్రూపుగా మగ్గం పెట్టుకోవటానికి స్థలం ఇస్తామని, ఇల్లు లేకపోతే చేనేత కార్మికులకు, మగ్గాలు ఏర్పాటు చేసుకోవటానికి రూ.4.30 లక్షలకు అదనంగా మరో రూ.50 వేలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఉత్పత్తులకు సరైన ధర రావటానికి అన్ని విధాలుగా సహకరిస్తాం. ప్రైవేటు రంగాలు కూడా చేనేతను ప్రోత్సహించే విధంగా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.