తెలంగాణలోని ప్రతి పంచాయతీలో బడి ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్ఠం చేశారు. బడి లేని పంచాయతీ తెలంగాణలో ఉండొద్దని సచివాలయంలో విద్యాశాఖ సమీక్షలో అన్నారు. ‘రాష్ట్రంలో ఎంత చిన్న గ్రామమైన, మారుమూల తాండా అయినా తప్పకుండా ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందే. ఏ ఒక్క బాలుడు గానీ, బాలిక గానీ చదువుకై ఇతర గ్రామాలకు, పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దు. విద్యార్థులు లేరనే నెపంతో మూసివేసిన అన్ని పాఠశాలను తెరిపించాలన్నారు. ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ పాఠశాలను నడపాల్సిందే’ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీనికోసం వెంటనే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులను భర్తీకి చర్యలను తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు..
రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ కాళీలను భర్తీ చేయడానికి డీ.ఎస్.సి నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మన ఊరు, మన బడి కార్యక్రమంలో జరిగిన పనుల పురోగతిని సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంకా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేసి, రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలన్నారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలలో ఉన్న అవాంతరాలపై దృష్ఠిసారించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. బదిలీల అంశంలో ఉన్న అవాంతరాలను, అభ్యంతరాలను అధిగమించడానికి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు.
విద్యాలయాలకు విద్యుత్తు బిల్లులకు సంబంధించి కేటగిరి మార్పునకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ సూచనలను చేశారు. విద్యాలయాలకు వ్యాపార, పారిశ్రామిక కేటగిరి కింద బిల్లులు వసూలు చేయడంపై తగిన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలన్నారు. పాఠశాలల్లో స్వీపర్లు, పారిశుధ్య కార్మికులను ఏర్పాటుచేయడానికి ఉన్న మార్గాల గురించి అధికారులను తగిన ఆదేశాలను జారీ చేశారు.