మేడిగడ్డపై అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మాజీ సీఎం కేసీఆర్ తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మేడిగడ్డకు ఎందుకుపోయారు…? ఏముంది అక్కడ బొందల గడ్డనా…!? అని కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆక్రోశం వెళ్లగక్కుతున్నాడని ముఖ్యమంత్రి మండిపడ్డారు. నిజమే… కేసీఆర్ ధనదాహంతో లక్ష కోట్లు గుమ్మరించి కట్టిన ప్రాజెక్టు ఇవ్వాళ బొందలగడ్డగా మారిందని దుయ్యబట్టారు. తొమ్మిదిన్నరేళ్ల క్రితం తెలంగాణను పచ్చగ చేస్తానని కల్లబొల్లి మాటలు చెప్పి, కాంగ్రెస్ ప్రారంభించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత – చేవేళ్ల డిజైన్లు మార్చి… కాళేశ్వరం పేరుతో కమీషన్లు బొక్కి కేసీఆర్ సృష్టించిన విధ్వంసం ఇవ్వాళ మేడిగడ్డ రూపంలో కళ్లముందు కనిపిస్తోందన్నారు. కూలింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు… తెలంగాణ ప్రజల నమ్మకం. కుంగింది మేడిగడ్డ పిల్లర్లు కాదు నాలుగు కోట్ల ప్రజల ఆశలన్నారు. ఈ నేరానికి శిక్ష తప్పదు. ఈ ఘోరం కళ్లారా చూసి… తెలంగాణ సమాజానికి చూపించే ప్రయత్నమే… సహచర మంత్రులు, శాసనసభ్యులతో కలిసి ఇవ్వాల్టి మేడిగడ్డ పర్యటన అని తెలిపారు.