లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీని నియమించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ విషయాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన కృషిని సీడబ్యూసీ కొనియాడింది. ఢిల్లీలో సుమారు మూడు గంటల పాటు జరిగిన సీడబ్యూసీ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. సీబీఐ, ఈడీ సంస్థలతో తమ పార్టీ నేతలను బ్లాక్‌మెయిల్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిందిస్థాయి నుంచి పై స్థాయి కార్యకర్తల వరకు ఎంతో కష్టపడ్డారని అభినందించారు. రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి, కేరళోని వాయనాడ్‌ల నుంచి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ్ యాత్రలు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికి దోహదం చేసిందని అభిప్రాయపడ్డారు.