ఏపీలో కుండపోత వర్షాలకు ఉమ్మడి కృష్ణా జిల్లా వణికిపోయింది. వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. రోడ్లన్నీ జలదిగ్బంధమ్యాయి. వరద ప్రవాహానికి పలు చోట్ల కార్లు, ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. ఇళ్లలోకి వరద నీరు వచ్చిచేరింది. జనజీవనం అస్తవ్యస్తమైంది. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యలు చేపట్టారు.
అటు ప్రజాప్రతినిధులు స్థానికులను అప్రమత్తం చేసి సహాయకచర్యలను ముమ్మరం చేశారు. అర్థరాత్రి వేళ రామిలేరు వరద ముంచెత్తింది. ముంచుకొస్తున్న వరద నుంచి ప్రజలను కాపాడేందుకు అర్థరాత్రి 2 గంటలకు స్వయంగా దెందులూరు ఎమ్మెల్యే రంగంలోకి దిగారు.
“అమ్మా వరద వచ్చేస్తుంది, నిద్ర లేవండి .నేను పడవలు తెప్పిస్టాను – ఈలోపు డాబాల పైకి వెళ్ళండి” అంటూ రామిలేరువాగు వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను స్వయంగా అప్రమత్తం చేశారు తాళ్ళమూడి సహా పలు గ్రామాల్లోని జనావాస ప్రాంతాల్లోకి వరద నీరు ముంచెత్తుతుండటంతో నిద్ర మత్తులో ఉన్న ప్రజలను వరద గురించి హెచ్చరిస్తూ గ్రామాల్లో తిరిగారు. ఇతర గ్రామస్తులు సైతం ప్రజలను అప్రమత్తం చేసేలా సూచించారు.
ఎమ్మెల్యే చింతమనేని హెచ్చరికలతో అప్రమత్తం అయినా ప్రజలు తమ ఇంటి డాబాలపైకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వీతో ఫోన్లో మాట్లాడిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ “రామిలేరు వాగు వరద తీవ్రతను వివరించారు. ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా తక్షణమే అన్ని రకాల చర్యలు చేపట్టాలని సూచించారు. దిగువన ఉన్న లాకులు తెరవటం వంటి సత్వర చర్యల ద్వారా వరద ప్రవాహ తీవ్రతను జనావాసాల వైపు తగ్గించేలా చర్యలు చేపట్టాలన్నారు. పడవల ద్వారా లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేలా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా కలక్టర్ ఆదేశాలతో పలు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి.