ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, గ్రామీణ రక్షిత మంచినీటి పథకం, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా కొణిదల పవన్ కళ్యాణ్ బుధవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. పార్టీ కార్యాలయం నుంచి నేరుగా క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ వేద పండితులు శాస్త్రోక్తంగా పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, అధికారులు, పార్టీ నాయకులు ఆయన వెంట రాగా కార్యాలయంలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేసి పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం ఉదయం 10.30 నిమిషాలకు బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేశారు. అనంతరం ఉద్యాన పంటలకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసే ఫైల్ మీద తొలి సంతకం చేశారు. రెండో సంతకం – గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణం కోసం చేశారు. 2019లో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పి.ఆర్.అండ్ ఆర్.డి. ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కన్నబాబు, అటవీ శాఖ పీసీసీఎఫ్ చిరంజీవి చౌదరి, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, పవన్ కళ్యాణ్ గారి సోదరులు నాగబాబు గారు ఆయన వెంట ఉన్నారు.