ఏపీ సచివాలయం తాకట్టుపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టిన సీఎం జగన్ ఇప్పుడు రాష్ట్ర సచివాలయంపై కన్నేశారని మండిపడ్డారారు. దీన్ని కూడా నేడు తాకట్టు పెట్టేశారని సీరియస్ అయ్యారు. మరోసారి జగన్‌కు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే నాగార్జున సాగర్ డ్యాం, శ్రీశైలం డ్యాం , పోలవరం, శ్రీహరికోటలను కూడా తాకట్టు పెట్టేస్తారని ఆరోపించారు. మూడు రాజధానులంటూ తెరలేపి.. చివరికి ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారని దుయ్యబట్టారు. ఉన్న రాజధానిలోని రాష్ట్ర సచివాలన్ని కూడా తాకట్టు పెట్టేశారని ఆరోపించారు. విశాఖపట్నంలో 13 ప్రభుత్వ భవనాలు, కాలేజీలను కూడా తాకట్టు పెట్టి రూ.25 వేల కోట్లకు పైగా అప్పులు తెచ్చారని మండిపడ్డారు.
మద్యం తాకట్టుపెట్టి రూ.48 వేల కోట్లు, R&B ఆస్తులు తాకట్టు పెట్టి రూ.7 వేల కోట్లు అప్పు చేశారు. కానీ రోడ్లు వేయలేదన్నారు. టిడ్కో ఇళ్లు తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు అప్పు తెచ్చారు.. ఆ టిడ్కో ఇళ్లు కూడా పూర్తి చేయలేదు. చెత్త పన్నుతో సహా రకరకాల పన్నులతో రూ.లక్షల కోట్లు బాదాడని గంటా విమర్శలు గుప్పించారు. ఇలా ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పుల బాదుడుతో ఇప్పటికే ఒక్కో కుటుంబంపై రూ.8 లక్షల భారం మోపారు. ఇప్పుడు మరో రూ.370 కోట్ల అప్పు కోసం రాష్ట్ర సచివాలయ సముదాయాన్ని HDFC బ్యాంకుకు తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రతిష్ట మంటకలిపారని దుయ్యబట్టారు. ఈ 58 నెలల కాలంలో రూ.12 లక్షల కోట్లు అప్పు తెచ్చారు. సంక్షేమ పథకాలకు రూ.2 లక్షల కోట్లు పోగా మిగిలిన లక్షల కోట్లు ఏమయ్యాయి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. రేపు మన ప్రయివేటు ఆస్తుల్ని, భూముల్ని తాకట్టుపెట్టి లక్షల కోట్లు అప్పు తెచ్చుకొని లూటీ చేసే ప్రమాదం కూడా పొంచి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని కోరారు..