వైసీపీలో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. టికెట్ దక్కని వారు రాజీనామాల బాట పడుతున్నారు. ఇటీవల మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా చేశారు. తాజాగా అదే బాటలో రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైసీపీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. తాడేపల్లిలో సీఎం జగన్ను కలిసేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. కనీసం జగన్ను కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో జగన్ను నమ్ముకుని కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చానని రామచంద్రారెడ్డి చెప్పారు. మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి ఇవ్వలేదు. వైసీపీ గెలుపు కోసం ఇంటింటికి తిరిగాం.. జగన్ చెప్పిన ప్రతి పని చేశా.. కానీ ఇప్పుడు టికెట్ లేదని సజ్జల చెబుతున్నారని పేర్కొన్నారు. సర్వేల పేరు చెప్పి టికెట్ ఇవ్వలేమనడం చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్ఆర్సీపీలో ఇక మేము ఉండలేము. కల్యాణదుర్గం నుంచి నేను, రాయదుర్గం నుంచి నా భార్య స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు జగనే మా సర్వస్వం అనుకున్నాం.. కానీ మా జీవితాలు సర్వనాశనం అయ్యాయి. జగన్ ఇంత అన్యాయం చేస్తారని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.