తెలంగాణలో రాజకీయ వేడి మరింత పెరిగింది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది. ఇప్పుడు తెలంగాణ అధికార గీతం “జయ జయమే తెలంగాణ” స్వరకల్పన వ్యవహారం చర్చనీయాంశమైంది. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి స్వరపరుస్తున్నారు. అయితే తెలంగాణ అధికారిక గీతాన్ని ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందించడమేంటని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. తన పదళ్లే పాలనలో కనీసం జయ జయహే తెలంగాణ గేయాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించలేకపోయారని మండిపడ్డారు. ఇప్పుడు తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గేయాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామంటే కేసీఆర్, కేటీఆర్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“జయ జయమే తెలంగాణ” గీతాన్ని కిరవాణి కంపోజ్ చేస్తే .. ఆయన్ని ఆంధ్ర మూలాలున్న వ్యక్తిగా బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. మరి గతంలో తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా ఆంధ్ర కోడలైన సమంతను, తెలంగాణ స్వచ్ఛభారత్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆంధ్ర అమ్మాయి మంచు లక్ష్మిని, తెలుగు రాష్ట్రానికి సంబంధంలేని నటి రకుల్ ప్రీత్ సింగ్‌ని బాలిక విద్యకు బ్రాండ్ అంబాసిడర్‌గా కేటీఆర్ నియమించినప్పుడు తెలంగాణ సోయి గుర్తుకు రాలేదా అని నిలదీశారు. యాదాద్రి ఆర్కిటెక్ట్‌గా ఆంధ్ర సాయిని నియమించినప్పుడు తెలంగాణ పౌరుషం ఎక్కడికి పోయిందని కేసీఆర్‌ను ప్రశ్నించారు.