టీడీపీ-జనసేన ప్రభుత్వం రాగానే డీఎస్పీ వేసి టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. సీఎం జగన్ మోసంతో నిండా మునిగిన నిరుద్యోగులు ఆందోళన చెందవద్దని, అధైర్యపడొద్దని ధైర్యం చెప్పారు. 2019 ఎన్నికలకి ముందు అధికారంలోకి రాగానే 23 వేల ఖాళీ టీచర్ పోస్టులను భర్తీకి మోగా డీఎస్సీ వేస్తామని జగన్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. నమ్మి ఓట్లేసి గెలిపించిన నిరుద్యోగులకు ఇచ్చిన హామీని ఐదేళ్లపాటు మరిచిపోయాడు. దిగిపోయే ముందు 6వేల పోస్టుల భర్తీకి డీఎస్సీ వేస్తున్నామంటూ జగన్ మరోసారి మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే .. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే కనీసం పరీక్ష నిర్వహణ కూడా సాధ్యం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ అంటే మరోసారి నిరుద్యోగుల్ని వంచించే కుట్రలో బాగమేనన్న విషయాన్ని గుర్తించాలన్నారు.. జగన్ మాయమాటలు నమ్మొద్దని నిరుద్యోగులకు లోకేష్ సూచించారు.