కులాల మధ్య చిచ్చుపెట్టడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నైజం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. కుటుంబాలను విచ్ఛిన్నం చేసే వ్యక్తి అని దుయ్యబట్టారు. మనుషులను విడగొట్టే విషసంస్కృతి కుటుంబాల్లోకి కూడా వెళ్లిపోయిందని మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించిన ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి రూ.వేల కోట్లు సంపాదించి ఇద్దరు బిడ్డలకు సమానంగా ఇస్తే..ఆ ఆస్తిలో చెల్లికి జగన్ వాటాకూడా ఇవ్వలేదని ఆరోపించారు. సాక్షి పేపర్ ,టీవీ, భారతి సిమెంట్‌లో వాటాలు ఇవ్వలేదన్నారు. సొంత చెల్లికే ఆస్తి ఇవ్వని వ్యక్తం ప్రజలకేం చేస్తారని విమర్శించారు. అప్పులు తెచ్చి బటన్లు నొక్కడం కాదు.. అభివృద్ధి పనులు చేసేందుకు బటన్లు నొక్కాలని హితవు పలికారు. రాష్ట్రానికి మంచి జరగాలంటే ఓట్లు చీలకుండా పొత్తులతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ , జనసేన, బీజేపీ కలిస్తే తిరుగుండదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.