ఓ హాలీవుడ్ సినిమాకు పెట్టిన ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో భారతదేశం మార్స్ మిషన్ మంగళ్ యాన్ పూర్తి చేసిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రపంచంలో ఇంత తక్కువ ఖర్చుతో ప్రపంచంలో అంతరిక్ష పరిశోధనలు చేసిన దేశాలు లేవంటే మామూలు విషయం కాదని ప్రశంసించారు. ప్రపంచ దేశాలన్నీ భారతదేశం అతి తక్కువ ఖర్చుతో చేస్తున్న ప్రయోగాల వైపు దృష్టి సారించాయంటే మన ఇస్రో చేస్తున్న కృషి, పని తీరు అసమానం అని చెప్పాలి. ఇస్రోలో పని చేస్తున్న సఫాయి దగ్గర నుంచి ఛైర్మన్ వరకు అంతా ఈ గొప్ప ప్రయాణంలో భాగస్వాములే అని కొనియాడారు.
జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన సంస్థ (షార్) నిర్వహించిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సామాన్యుడు ఈ రోజు ఎంతో ఆనందంతో అనుభవిస్తున్న శాస్త్ర సాంకేతిక రంగాల ప్రతిఫలాల వెనుక ఇస్రో శాస్త్రవేత్త కృషి ఉందన్నారు. జీవితంలో సుఖాలను, సంతోషాలను, బాధలను, బంధాలను సైతం త్యాగం చేసిన ఎందరో శాస్త్రవేత్తల శ్రమ దాగుందని గుర్తుచేశారు. అంతరిక్ష పరిశోధనలే ప్రాణంగా పని చేస్తున్న ఎందరో మహానుభావుల పరిశ్రమ దాగుందన్నారు దేశం కోసం, జాతి కోసం తమ సొంత కుటుంబాలను, ఇష్టాలను వదులుకొని, అవమానాలు, అవహేళనలను పట్టించుకోకుండా ముందుకు సాగిన గొప్ప వ్యక్తుల సాహస ప్రయాణం దాగుంది. వారే ఈ దేశానికి నిజమైన హీరోలు. ఆ అన్ సంగ్ హీరోలే నాకు నిజ జీవిత హీరోలుగా అనిపిస్తారని పేర్కొన్నారు. తెరపై కనిపించకుండా దేశం కోసం జీవితాన్ని ధారబోసిన శాస్త్రవేత్తలు నాకు నిజమైన స్ఫూర్తిప్రదాతలని అన్నారు.
2014లో న్యూయార్క్ టైం పత్రికలో మన అంతరిక్ష పరిశోధన సంస్థ గురించి వ్యంగ్యంగా ఓ కార్టూన్ వచ్చింది. సరిగ్గా దశాబ్దం తర్వాత అదే న్యూయార్క్ టైం పత్రిక.. నడుస్తున్న దేశం అయిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మన ఇస్రోతో కలిసి సంయుక్తంగా పనిచేయడానికి ఆసక్తి చూపిందంటే ఇస్రో ప్రయాణం ఎంత గొప్పగా, పట్టుదలతో సాగిందో అర్ధం అవుతందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధనల్లో భారత్ ఎక్కడ రాజీ పడకుండా ప్రయాణం చేస్తుందని అన్నారు.