తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిల భేటీపై కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి, తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాదుకు వచ్చారని అందరూ భావించారు. కానీ, తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలకంటే తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే చంద్రబాబు రహస్య అజెండాగా ఉన్నాయేమో అన్న అనుమానం కలుగుతోందని ఆరోపించారు. ఎందుకంటే, తెలంగాణాలో మళ్లీ తెలుగుదేశం పార్టీ విస్తరిస్తుందని చంద్రబాబు చేసిన ప్రకటనే ఇందుకు ఉదాహరణ అంటూ విమర్శించారు. తెలంగాణాలో తెలుగుదేశం బలపడుతుందని చంద్రబాబు అనడం పలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.
తెలంగాణలో తెలుగుదేశం ఎప్పటికీ బలపడదు గాని… తెలుగుదేశం పార్టీ తన కూటమి భాగస్వామి అయిన బీజేపీ తో కలిసి తెలంగాణ ల బలపడేందుకు కుట్రలు చేసేందుకు ప్రయత్నిస్తే టీడీపీతో పాటు బీజేపీ కూడా ఇక్కడ మునిగి గల్లంతయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఉద్యమ తెలంగాణల తప్పక ఏర్పడి తీరుతాయి. తిరిగి తెలంగాణవాదులు, ఉద్యమకారులు పోరాట ప్రస్థానానికి కదలటం నిశ్చయమైన భవిష్యత్ వాస్తవం అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అంతే కాదు, అసలు తెలంగాణల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన బాగున్నదని విస్పష్టంగా ప్రకటించిన చంద్రబాబు గార్కి, తెలంగాణ రాష్ట్రం ల టీడీపీని తిరిగి బలపరుస్తం అని అనవలసిన అవసరం ఏమున్నది? విజయశాంతి ప్రశ్నించారు.
చంద్రబాబు కూటమి పార్టీ బీజేపీకి కూడా తెలంగాణల కాంగ్రెస్ పరిపాలన మంచిగున్నది, మీ నాయకులు ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేయవలసిన అవసరం లేదు అని చెప్పటం తప్పక సమంజసంగా ఉంటది, బహుశా అంటూ విజయశాంతి వ్యాఖ్యానించారు.