ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో అరాచక పాలన నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి ఐదో వర్థంతి సందర్భంగా కడపలో నిర్వహించిన స్మారక సభలో ఆమె ఉద్వేగభరితంగా మాట్లాడారు. అన్నా అని పిలిపించుకున్నవారే హంతుకులకు రక్షణగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. చిన్నాన్న వివేకా మరణంతో ఎక్కువగా నష్టపోయింది చిన్నమ్మ సౌభాగ్యమ్మ, ఆయన కుమార్తె సునీతమ్మ అని ఆవేదన వ్యక్తం చేశారు. హంతకులు ఎవరో కాదు.. సొంత బంధువులే అని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
బాధితులకు అండగా ఉండాలన్న ఆలోచన చేయకపోగా వారిపైనే ఆరోపణలు చేస్తారా అన్నా అని ప్రశ్నించారు. నేటికి ఐదేళ్లయినా హత్య చేసిన, చేయించిన వాళ్లకు శిక్ష పడలేదని మండిపడ్డారు. జగనన్నా మీరు అద్దం ముందు నిల్చొని మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్శించుకోవాలని హితవు పలికారు. మీ మనస్సాక్షి ఏం చేబుతుందో వినండి . తోబుట్టువుల కోసం మీరేం చేశారు అని నిలదీశారు.